: పవన్ కల్యాణ్ అంకుల్ వస్తే నా జ్వరం తగ్గిపోతుంది: ఓ చిన్నారి


ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ తనను చూడటానికి వస్తే తన జ్వరం తగ్గిపోతుందంటున్న ఒక చిన్నారి మాటలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. ‘నాకు చిన్నప్పటి నుంచి హీరో పవన్ కల్యాణ్ అంటే ఎంతో ఇష్టం. పవన్ అంకుల్ వస్తే.. నా జ్వరం పోతుంది’ అని అంటున్న ఆ చిన్నారి గురించిన వివరాలు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లోని పెదపేటకు చెందిన రత్నరాజు, రమాదేవి దంపతుల ఆరేళ్ల కూతురి పేరు నూకల కనకచంద్రదీపిక. తమ కూతురుకి నీరసంగా ఉండటంతో నెల రోజుల క్రితం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల్లో చిన్నారికి బ్లడ్ కేన్సర్ అని తేలడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఈ వ్యాధి నివారణకు సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని, హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో చిన్నారికి వైద్యం అందించేలా ఎంపీ తోటీ సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు చర్యలు తీసుకుంటున్నట్లు చిన్నారి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వైద్య చికిత్స అందేలా వారు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఇప్పటికే తమ ఇంటిని తాకట్టు పెట్టామని, దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. అయితే.. తనకు బ్లడ్ కేన్సర్ అన్న విషయం తెలియని ఈ చిన్నారి జ్వరం వచ్చిందని అనుకుంటోంది. పవన్ కల్యాణ్ ని చూస్తే తన జ్వరం తగ్గిపోతుందని దీపిక చెబుతోంది.

  • Loading...

More Telugu News