: ఇకపై ట్రెయిన్ హోస్టెస్ లు సాదరంగా ఆహ్వానిస్తారు!
బ్యాక్ గ్రౌండ్ లో వినసొంపైన సంగీతం వినిపిస్తుండగా, ట్రెయిన్ హోస్టెస్ లు గులాబీ పువ్వు ఇచ్చి రైలు ప్రయాణికులకు ఆహ్వానం పలికే రోజులు త్వరలో రానున్నాయి. ఢిల్లీ-ఆగ్రాల మధ్య నడిచే మొదటి సెమీ హైస్సీడ్ రైలు 'గతిమాన్ ఎక్స్ ప్రెస్'లో ట్రెయిన్ హోస్టెస్ ల ఏర్పాటు కు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. క్యాటరింగ్ సర్వీసుతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనుంది. మార్చిలో ఈ రైలు సర్వీసులు ప్రారంభించనున్నట్లు సమాచారం. లైవ్ టీవీ, ఆటోమేటిక్ ఫైర్ అలారం, హై-పవర్ అత్యవసర బ్రేకింగ్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఈ రైల్లో వుంటాయి. అయితే, ఈ రైల్లో టికెట్ ధర శతాబ్ది ఎక్స్ ప్రెస్ ధర కంటే సుమారు 25 శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా రైళ్లను కాన్పూర్-ఢిల్లీ, ఛండీగఢ్-ఢిల్లీ, హైదరాబాద్-చెన్నై, నాగపూర్-బిలాస్ పూర్, గోవా-ముంబయి, నాగపూర్- సికింద్రాబాద్ ల మధ్య నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా, వచ్చే రైల్వే బడ్జెట్ లో ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించనున్నారు.