: మాది మైండ్ గేమ్ కాదు... మార్చి 5లోగా వైసీపీ ఎమ్మెల్యేల లెక్క తేలుతుంది: ఏపీ మంత్రి ప్రత్తిపాటి


ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో పది మంది తమ పార్టీలోకి వస్తున్నారని ఆ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న టీడీపీ గడచిన వారం రోజులుగా చెబుతోంది. అయితే టీడీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ వైసీపీ చెబుతోంది. ఈ రెండు పార్టీల వాదనలు ఎలా ఉన్నా... ఇప్పటిదాకా ఒక్క ఎమ్మెల్యే కూడా ఇటు నుంచి అటు గాని, అటు నుంచి ఇటు గాని గోడ దూకలేదు. అయితే వైసీపీ సీనియర్ నేత, కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియలు సైకిలెక్కడం ఖాయమన్న వార్తలు మూడు రోజులుగా జోరందుకున్నాయి. ఈ సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం గుంటూరులో మీడియాతో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా మాది మైండ్ గేమ్ ఎంతమాత్రం కాదు. వచ్చే నెల 5లోగా వైసీపీకి చెందిన ఎంతమంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరతారో మీరే చూస్తారు. ఆ తర్వాత వైసీపీకి మిగిలే ఎమ్మెల్యేల లెక్క తేలుతుంది’’ అని ఆయన మరో ఆసక్తికర చర్చకు తెర లేపారు.

  • Loading...

More Telugu News