: డిండి ప్రాజెక్టు... పాలమూరు, నల్లగొండ ‘గులాబీ’ నేతల మధ్య చిచ్చు పెట్టింది!


తెలంగాణలోని నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడిస్తోంది. పక్కనే ఉన్న కృష్ణా నది జలాలు హైదరాబాదుకు తరలిపోతున్నా, నల్లగొండ జిల్లా ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించలేని దుస్థితి నెలకొంది. ఈ పాపం ఏ ఒక్క పార్టీదో, ప్రభుత్వానిదో కాదు... అన్ని పార్టీలకూ ఈ పాపంలో భాగం ఉందనే చెప్పాలి. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నల్లగొండ జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ భూతం నుంచి విముక్తి కల్పించేందుకు టీఆర్ఎస్ సర్కారు పక్కా ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా గతంలో ఎప్పుడో ప్రణాళిక రూపొందిన డిండి ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలకు బూజు దులిపింది. శ్రీశైలం ప్రాజెక్టు జలాలను ఆధారం చేసుకుని ఎత్తిపోతల పథకం నిర్మాణానికి కేసీఆర్ సర్కారు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతా బాగానే ఉన్నా... డిండి ఎత్తిపోతల పథకం కెనాల్ రూట్ పై నల్లగొండ జిల్లాకు పొరుగున ఉన్న పాలమూరు జిల్లా వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనల్లో ఉన్నట్టుగానే కెనాల్ నిర్మిస్తే తమ జిల్లాకు తీరని అన్యాయం జరగడం ఖాయమని పాలమూరు ప్రజలు వాపోతున్నారు. అయితే ఏళ్ల తరబడి ఫ్లోరైడ్ తో బాధపడుతున్న తాము.. ఎట్టకేలకు ఎత్తిపోతల పథకం పట్టాలెక్కుతోందని సంబరపడుతున్న నేపథ్యంలో దానికి అడ్డంకులు కలిగించడమేమీ బాగోలేదని అటు నల్లగొండ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇరు జిల్లాల నేతల మధ్య ఈ విషయంపై మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రస్తుతం దీనిపై ఇరు జిల్లాలకు చెందిన మంత్రుల మధ్యే ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై సమాచారం అందుకున్న సీఎం కేసీఆర్... ట్రబుల్ షూటర్ గా పేరున్న తన మేనల్లుడు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును రంగంలోకి దించారు.

  • Loading...

More Telugu News