: ఇక గన్నవరం ఎయిర్ పోర్టుకు భూసేకరణ... నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ సర్కారు
నవ్యాంధ్రప్రదేశ్ లో మరో భారీ భూసేకరణకు రంగం సిద్ధమైంది. విజయవాడకు సమీపంలోనే కాకుండా నవ్యాంధ్ర నూతన రాజధానికి ఆయువుపట్టుగా నిలవనున్న గన్నవరం ఎయిర్ పోర్టును విస్తరించేందుకు చంద్రబాబు సర్కారు కార్యరంగం సిద్ధం చేసింది. ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత ట్రాఫిక్ పెరిగిన గన్నవరం ఎయిర్ పోర్టును మరింత విస్తరించి అంతర్జాతీయ ఎయిర్ పోర్టు హోదా కల్పించేందుకు సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 1,229 ఎకరాల భూమి అవసరమని అధికారులు తేల్చారు. అధికారుల నివేదికను ఆధారం చేసుకుని 11 గ్రామాల పరిధిలోని 1,229 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై అభ్యంతరాలను తెలిపేందుకు మార్చి 6ను తుది గడువుగా నిర్ణయించింది. అంతేకాకుండా ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసమంటూ ప్రత్యేకంగా ‘గన్నవరం ఎయిర్ పోర్ట్ కాంపిటెంట్ అథారిటీ’ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణం కోసం కొత్తగా రంగప్రవేశం చేసిన సీఆర్డీఏ తరహాలోనే కాంపిటెంట్ అథారిటీ పనిచేయనున్నట్లు సమాచారం.