: సీబీఐ మాజీ చీఫ్ విజయరామారావు కుమారుడిపై సీబీఐ కేసు... బ్యాంకులకు రూ.304 కోట్లు ఎగవేసిన వైనం
దేశంలో కీలక కేసులను దర్యాప్తు చేస్తున్న సీబీఐకి ఒకప్పుడు డైరెక్టర్ గా వ్యవహరించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ మంత్రి విజయరామారావు కుమారుడు శ్రీనివాస కల్యాణరావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. మూడు బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకున్న కల్యాణరావు... వాటిని తీర్చడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ నిన్ననే ఆయనపై కేసు నమోదు చేసింది. ఆ తర్వాత వెనువెంటనే రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు హైదరాబాదు, చెన్నైలోని కల్యాణరావు ఇళ్లపై ఏకకాలంలో సోదాలు చేశారు. కేసు నమోదు నేపథ్యంలో నేడు కల్యాణరావును సీబీఐ అధికారులు విచారించే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రుణాల విషయానికొస్తే... వ్యాపారాల పేరిట కొన్ని ఆస్తులు తనఖా పెట్టిన కల్యాణరావు 3 బ్యాంకుల నుంచి రూ.304 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. ఇందులో సెంట్రల్ బ్యాంకు రూ.124 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు రూ.120 కోట్లు, ఆంధ్రా బ్యాంకు రూ.60 కోట్ల మేర రుణాలు ఇచ్చాయి. రుణాలు తీసుకున్న తర్వాత కల్యాణరావు వాయిదాలు చెల్లించకపోవడంతో ఆయన సమర్పించిన బిల్లులు, డాక్యుమెంట్స్ ఆయా బ్యాంకులు పరిశీలించాయి. ఈ క్రమంలో సదరు బిల్లులు నకిలీవిగా తేలినట్లు సమాచారం. దీంతో వేగంగా స్పందించిన బ్యాంకులు సీబీఐని ఆశ్రయించాయి. ఒకప్పుడు సీబీఐకి చీఫ్ గా వ్యవహరించిన పోలీసు అధికారి కుమారుడిపైనే అదే సంస్థ కేసు నమోదు చేసిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెను కలకలం రేపే అవకాశాలున్నాయి.