: ప్యాంపోర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు... ఐదుకు చేరిన మృతుల సంఖ్య


జమ్మూ కాశ్మీర్ లోని ప్యాంపోర్ లో నిన్న సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై మెరుపు దాడికి దిగి నలుగురి ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు... కొద్దిసేపటి క్రితం భీకర దాడి ప్రారంభించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తాజాగా ఓ ఆర్మీ కెప్టెన్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉగ్రవాదుల దాడిలో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. నిన్న సాయంత్రం హఠాత్తుగా విరుచుకుపడ్డ ఉగ్రవాదులు... ఆత్మ రక్షణలో భాగంగా సమీపంలోని ఓ ప్రభుత్వ భవనంలోకి వెళ్లి దాక్కున్నారు. ఈ క్రమంలో భవనంలోని దాదాపు వంద మందికి పైగా విద్యార్థులను సురక్షితంగా కాపాడిన సైన్యం, ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఆ భవనం చుట్టూ మోహరించింది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత కాల్పులను విరమించిన సైన్యంపై కొద్దిసేపటి క్రితం ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ చనిపోయారు. అక్కడ ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడి తరహాలోనే ఉగ్రవాదులు పెను విధ్వంసం సృష్టించేందుకే తాజా దాడికి దిగారు. ఉగ్రవాదుల కాల్పులకు దీటుగా సైన్యం కూడా కాల్పులు కొనసాగిస్తోంది. కాల్పుల మోతతో ప్యాంపోర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News