: ఆ మండలాలను చేరిస్తేనే సీఎంగా ప్రమాణం చేస్తానని చెప్పా!... కేసీఆర్ ఏ గ్రామాలడిగారో తెలియదు: చంద్రబాబు


రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన మెజారిటీ గ్రామాలు ఏపీలోకి బదిలీ అయ్యాయి. ఈ వ్యవహారంపై నాడు పెను దుమారమే రేగింది. ముంపు పేరిట కొన్ని మండలాలను ఏపీలోకి బదలాయించడాన్ని నాడు తెలంగాణ వాదులు గట్టిగానే వ్యతిరేకించారు. అయితే ప్రాజెక్టు ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంటే, ముంపు మండలాలు కూడా ఆ రాష్ట్రం పరిధిలోనే ఉండాలని వాదించిన కేంద్రం, ఈ వ్యతిరేకతను ఏమాత్రం పట్టించుకోకుండా, ఆ మండలాలను తెలంగాణ నుంచి ఏపీలోకి బదలాయించేసింది. ఆ తర్వాత కొంతకాలం పాటు తెలంగాణ ఆ మండలాలను అసలు పట్టించుకోలేదు. పొరుగు రాష్ట్రంలోకి వెళ్లిపోయిన మండలాల పాలన బాధ్యతలు ఆ రాష్ట్ర పరిధిలోకే వస్తాయంటూ తెలంగాణ సర్కారు నాడు సుస్పష్టం చేసింది కూడా. అయితే కాలక్రమేణా ఆ గ్రామాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్వరం మార్చారు. ఇటీవల సదరు గ్రామాలు తిరిగి తెలంగాణలోకి వచ్చేస్తున్నాయని కూడా ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన ప్రతిపాదనకు అంగీకరించారని చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా చంద్రబాబు నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న విజయవాడలో మీడియా సమావేశం సందర్భంగా దీనిపై స్పందించిన చంద్రబాబు ‘‘పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో చేరిస్తేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని పట్టుబట్టా. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పడగానే, తొలి కేబినెట్ లోనే ముంపు మండలాలను ఏపీలో చేర్చారు’’ అని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ‘‘ఆ విషయంపై నాకు సమాచారం లేదు. ఆయన ఏ గ్రామాలు అడిగారో తెలియదు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News