: కారు అడిగారని పెళ్లి రద్దు చేసుకుని కేసు పెట్టింది!
వరకట్నం డిమాండులపై యువతులు యుద్ధం ప్రకటిస్తున్నారు. అత్తింటి వారి ఆలోచనలను పసిగట్టి ముందుగానే మేల్కొంటున్నారు. తాజాగా రాజస్థాన్ లోని ఫెయితపుర గ్రామానికి చెందిన భారతీ యాదవ్ కు, బరన్ ప్రాంతానికి చెందిన శంభు దయాల్ తో ఈ నెల 15న నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా శంభుకు ద్విచక్రవాహనం, కొన్ని తులాల బంగారం కానుకగా ఇచ్చారు. అయితే ఆ తరవాత వారికి ఆశపెరిగింది. వివాహం సందర్భంగా కారు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి భారతి తల్లిదండ్రులు అది తమవల్ల కాదన్నారు. దీంతో కారు ఇస్తేనే నిర్ణయించిన ప్రకారం ఈ నెల 22న వివాహం జరుగుతుందని, లేని పక్షంలో జరగదని వరుడి తరఫు వారు తేల్చి చెప్పారు. నిశ్చితార్థం జరగడంతో చేసేది లేక, భారతి తల్లిదండ్రులు ఆరు నెలల్లో కారు ఇస్తామని చెప్పారు. దీంతో అందుకు తగ్గా మొత్తానికి ప్రామిసరీ నోటు రాయించి తీసుకున్నారు. ఈ తతంగమంతా చూసిన భారతి ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. శంభుతో నిర్ణయించిన వివాహాన్ని రద్దు చేసుకుని, నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.