: 'ప్రయాణిస్తే రైల్లోనే' అనే రోజులు త్వరలో!
రైల్లో ప్రతి కూపేలో ఓ టీవీ, ఆపై ఆటలు ఆడుకునేందుకు గేమింగ్ కన్ సోల్, ఉచిత వైఫై, ఇంటర్నెట్ వాడుతూ ఏవైనా సీటు వద్దకే తెప్పించుకోవడం వంటి కేటలాగ్ తో కూడిన సదుపాయాలు లభిస్తే... ఇక విమానాలు వద్దు, రైళ్లలోనే వెళతాం అంటారేమో! రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయాలన్న లక్ష్యంతో ఆ శాఖా మంత్రి సురేష్ ప్రభు కొన్ని కీలక నిర్ణయాలను 2016-17 రైల్వే బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంగా కేంద్రం ప్రకటించిన రూ. 10 వేల కోట్ల కార్పస్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్న ఆయన, రైల్వేలకు ఉపయోగపడేలా కంపెనీలు ప్రారంభించేవారికి, వినూత్న ఆలోచనలతో యాప్ లను తయారు చేసే యువతకు రుణాలిప్పించేలా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. రైళ్లలో సకల సదుపాయాలు ప్రస్తుతానికి ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రయాణికులకు, ఆపై దశలవారీగా సెకండ్, థర్డ్ ఏసీ ప్రయాణికులకు అందించాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ ఏసీ కూపేల్లో డీటీహెచ్ సేవలతో కూడిన టెలివిజన్ సెట్లను అమర్చే పనులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతాయని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి.