: వైసీపీని వదిలిపెట్టి ఎవరూ వెళ్లడం లేదు: ఎస్వీ మోహన్ రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ టీడీపీలోకి వెళుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ మొదటిసారి అధికారికంగా స్పందించింది. వైసీపీని వీడి ఎవరూ టీడీపీలోకి వెళ్లడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్నవన్నీ అవాస్తవాలనీ, తమను వివరణ అడగకుండానే పలు ఛానల్స్ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి ప్రచారం వల్ల ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఏదైనా రాయాలనుకుంటే ముందుగా తమకు ఫోన్ చేసి వివరణ అడగాలని హితవు పలికారు. కొద్దిసేపటి కిందట జరిగిన సమావేశంలో జగన్ తమతో ఏదో అన్నారంటూ ఓ ఛానల్ వారు స్క్రోలింగ్ వేస్తున్నారని, అది కూడా వాస్తవం కాదని వివరించారు. తమ అధినేత తమతో అలాంటివేవీ మాట్లాడలేదని, కేవలం కర్నూలు జిల్లా విషయాలే మాట్లాడుకున్నామని స్పష్టం చేశారు.