: కాకులను కొట్టి గద్దలకు పెడుతున్న చంద్రబాబు: నిప్పులు చెరిగిన రఘువీరా
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పరిపాలన కాకులను కొట్టి గద్దలకు పెడుతున్నట్టుగా ఉందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన బాబు వైఖరిని ఎండగట్టారు. కృష్ణా నది గట్లపై ఏళ్లతరబడి నివాసాలు ఏర్పరచుకుని ఉంటున్న వారికి ప్రత్యామ్నాయం చూపకుండా బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి సేకరించిన భూమిలో యోగా గురు జగ్గీ వాసుదేవ్ కు 400 ఎకరాలు అప్పగించడమేంటని ప్రశ్నించారు. ఈ విషయంలో ఆందోళన చేసిన మల్లాది విష్ణుపై కేసు పెట్టడాన్ని ఖండించారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేశామా అని ఆలోచించే పరిస్థితి నెలకొందని, విభజన విషయంలో బీజేపీ, టీడీపీలు మాటమార్చి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలిపాయని ఆరోపించారు.