: కింకర్తవ్యం... మల్లగుల్లాలు పడుతున్న మోదీ సర్కారు!


హర్యానాలో జరుగుతున్న జాట్ల హింసాకాండపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న విషయమై మోదీ సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. హింసాత్మక ఘటనలు పెచ్చుమీరడం, సామాన్య జనజీవనం అస్తవ్యస్తం కావడంపై ఈ ఉదయం కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ లు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఉద్యమాలు శాంతియుతంగా జరుపుకోవాలని కోరిన వీరు, జాట్ పెద్దలు తక్షణం నిరసనలకు స్వస్తి పలికి ప్రభుత్వంతో చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కేంద్రం కట్టుబడి వుందని, జాట్ల రిజర్వేషన్ల అంశం సున్నితమైనది కావడంతో ఆచి తూచి వ్యవహరించాల్సి వుందని ఈ సందర్భంగా జైట్లీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. రాజ్ నాథ్ సింగ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రక్షణ శాఖ అధికారులు, పోలీస్ బాస్ లు కూడా హాజరై పరిస్థితిని సమీక్షించారు. అల్లర్లకు పాల్పడి విధ్వంసాలకు దిగే వారిని ఉపేక్షించవద్దని రాజ్ నాథ్ పోలీసులకు సూచించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిని తక్షణం అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 8 జిల్లాల్లో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News