: తెలంగాణ ఏర్పడ్డ రోజునే మెట్రో పరుగులు!
హైదరాబాద్ లోని నాగోల్ - మెట్టుగూడ, మియాపూర్ - ఎస్సార్ నగర్ మధ్య జూన్ 2 నుంచి మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే జూన్ తొలి వారం నుంచి మెట్రో సేవలు ప్రారంభమవుతాయని కేటీఆర్ ప్రకటించగా, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉండటంతో, ఆ రోజునే మెట్రో ప్రారంభోత్సవం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. కాగా, జూన్ రెండవ తేదీకి ఇంకా 3 నెలలా ఒక్క వారం గడువు ఉండటంతో మిగిలివున్న చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మియాపూర్ నుంచి హౌసింగ్ బోర్డ్, కూకట్ పల్లి, వై జంక్షన్, ఎర్రగడ్డ, ఈఎస్ఐల మీదుగా ఎస్ఆర్ నగర్ వరకు, నాగోల్ నుంచి ఉప్పల్ జంక్షన్, క్రికెట్ స్టేడియం, హబ్సిగూడ, తార్నాకల మీదుగా మెట్టుగూడ వరకూ మెట్రో ట్రాక్ నిర్మాణం గతంలోనే పూర్తికాగా, ట్రయల్ రన్స్ సైతం విజయవంతమైన సంగతి తెలిసిందే.