: నాకు అన్నీ అన్నే...అన్నకు అన్నీ నేనే: సచిన్ టెండూల్కర్
తన జీవితంలో అన్న అజిత్ టెండూల్కర్ పాత్రను దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ప్రతిసారీ గుర్తుచేసుకుంటాడు. అన్న అజిత్ తన జీవితం నుంచి విడదీయరాని మనిషని మరోసారి చెప్పాడు. తన గురువు ఆచ్రేకర్ వద్దకు తీసుకెళ్లడం దగ్గర్నుంచి, తన ఆటలో మెరుగుపర్చుకోవాల్సిన అంశాల వరకు అన్ని విషయాల్లోనూ అన్న ప్రధాన పాత్ర పోషించాడని సచిన్ తెలిపాడు. రిటైర్మెంట్ రోజు వాంఖడే స్టేడియంలో అవుటైన విధానం గురించి కూడా తన అన్నతో చర్చించానని సచిన్ గుర్తు చేసుకున్నాడు. తనకు ఏ సందేహం వచ్చినా దానికి సమాధానం చెప్పేది తన అన్న అజిత్ మాత్రమేనని తెలిపాడు. తన కంటే తన అన్నే ముందు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడని భావించానని, అయితే అది కుదర్లేదని సచిన్ అన్నాడు. తన కెరీర్ లో వరల్డ్ కప్పును చేతుల్లో పట్టుకుని చూడాలని కలలు కన్నానని, దానిని సగర్వంగా ఎత్తుకోవడమే తన లక్ష్యంగా మారిందని, 2011 వరల్డ్ కప్ తో ఆ కోరిక తీరిందని సచిన్ తెలిపాడు. తన అన్న పూర్తి సమయం కేటాయించి తన విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని సచిన్ చెప్పాడు.