: ధోనీని ఏమీ అనకండి: రవిశాస్త్రి
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి బాసటగా నిలిచాడు. గతంలో కోహ్లీతో కలిసి ధోనీ స్థాయిని తగ్గించే ప్రణాళికలు రచిస్తున్నాడని రవిశాస్త్రిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, శ్రీలంకలపై టీట్వంటీ సిరీస్ లు గెలిచిన అనంతరం రవిశాస్త్రి ధోనీకి అనుకూలంగా మాట్లాడడం విశేషం. కాగా, ధోనీపై గతంలో చేసిన విమర్శలు సరికాదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ధోనీ లాంటి క్రికెటర్ వైదొలగాలని సూచించడం కరెక్టు కాదని అన్నాడు. ధోనీ దేశానికి ఎన్నో విజయాలు అందించిన కెప్టెన్ అని రవిశాస్త్రి గుర్తుచేశాడు. ధోనీకి క్రికెట్ నుంచి ఎప్పుడు తప్పుకోవాలో బాగా తెలుసని అన్నాడు. గతంలో ఎవరూ కోరకుండానే టెస్టు జట్టు నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి గుర్తుచేశాడు. అలాగే తాను ఆడలేను అనుకున్న రోజున ధోనీ స్వచ్ఛందంగా తప్పుకుంటాడని శాస్త్రి పేర్కొన్నాడు. ధోనీ ఆరోనంబర్ లో బ్యాటింగ్ కు వస్తాడని, ఆ స్థానంలో భారత్ కు మెరుగైన ఆటగాళ్లు పోటీలో ఉన్నారని అన్నాడు. ఆ స్థానంలో బ్యాటింగ్ కు రావడం ఒత్తిడితో కూడకున్నదని, జట్టుకు అవసరమైనప్పుడు ధోనీ బ్యాటు నుంచి సిక్సర్లు, ఫోర్లు వస్తాయని శాస్త్రి చెప్పాడు. అయితే ఎప్పుడో విమర్శలు వస్తే వాటిని అప్పుడు ఖండించడం మానేసి, అంతా మర్చిపోయిన తరువాత రవిశాస్త్రి గుర్తుచేస్తూ మాట్లాడడం వెనుక మతలబు ఏంటా? అని అంతా బుర్రలు గోక్కుంటున్నారు.