: వసూళ్లు రూ.10 వేల కోట్లు... ఖాతాల్లో రూ.6 లక్షలే: ‘అగ్రిగోల్డ్’పై హైకోర్టు విస్మయం


నాలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది మధ్య తరగతి ప్రజలను నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో హైకోర్టు రోజుకో సంచలన వ్యాఖ్య చేస్తోంది. మొన్నటికి మొన్న కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో సీబీఐకి కేసును అప్పగించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి ఏపీ సీఐడీ అధికారులకు చురకలంటించింది. తాజాగా కొద్దిసేపటి క్రితం ముగిసిన విచారణలో భాగంగా ధర్మాసనం మరింత ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది. జనం నుంచి రూ.10 వేల కోట్లను డిపాజిట్లుగా సేకరిస్తే... ప్రస్తుతం ఆ సంస్థ బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.6 లక్షలే ఉండటమేంటని న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గడచిన రెండేళ్లలోనే అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల సొమ్మును అక్రమంగా తరలించేసిందని అభిప్రాయపడ్డారు. నిబంధనలను తోసిరాజని నిధులను పక్కదారి పట్టిస్తున్న అగ్రిగోల్డ్ నయా మోసాన్ని గుర్తించడంలో విఫలమయ్యారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కేసు నమోదు చేసిన ఏడాది తర్వాత నిందితులను అరెస్ట్ చేయడమేమిటని కూడా సీఐడీ అధికారులను కోర్టు నిలదీసింది.

  • Loading...

More Telugu News