: మందు కొట్టిన కోతి చేతికి కత్తి దొరికితే... బ్రెజిల్ కోతి విన్యాసాల వీడియో మీరూ చూడండి!
బ్రెజిల్ లోని పరైబా ప్రాంతంలో ఉన్న ఓ బార్ అది. అక్కడికి ఓ కోతి వచ్చింది. దానికి ఎలా దొరికిందో ఏమో, రమ్ము దొరకడంతో ఫుల్లుగా తాగేసింది. అసలే కోతి, పైగా మద్యం మత్తు తలకెక్కింది. ఆపై దానికి ఓ అడుగు పొడవైన కత్తి కూడా దొరికింది. ఇక చూడండి... చుట్టుపక్కల వాళ్లను ఎంతగా భయపెట్టిందంటే, కత్తి చేతబట్టి మనుషుల వెంట పరుగులు పెట్టింది. తప్పించుకునేందుకు ప్రజలూ పరిగెత్తాల్సి వచ్చింది. అదే కత్తితో భవనాలపై తిరుగాడుతూ ఉంటే, కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. కోతి ఆగడాలు పెరగడంతో బార్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఆపై దాన్ని బంధించే క్రమంలో వారికీ ముప్పుతిప్పలు తప్పలేదు. చివరికి ఎలాగోలా పట్టుకుని దాన్ని అడవిలో వదిలారు లెండి. కొంత సరదాగా, మరికొంత ఆందోళనగా ఉన్న ఆ వీడియోను మీరూ చూడవచ్చు.