: ఆ సౌకర్యం పొందే భారత తొలి సీఎంగా చంద్రబాబు!
ఓ ముఖ్యమంత్రి తన ఇంటి నుంచి ఎక్కడికైనా బయలుదేరితే ఆ మొత్తం మార్గంలో ట్రాఫిక్ కష్టాలు నిండిపోతాయన్న విషయం అందరికీ తెలిసిందే. మిగతా పరిపాలనపై ఏ విధమైన అభిప్రాయాలున్నా, రాజకీయ నేతల ప్రయాణాలు సామాన్యులకు విసుగును, కోపాన్ని తెప్పిస్తూనే ఉంటాయి. అమరావతి ప్రాంతంలో ఈ సమస్య ఉండకూడదని భావించినట్టున్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో నిర్మించతలపెట్టిన సచివాలయం రూఫ్ టాప్ పై హెలిప్యాడ్ నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక సెక్రటేరియట్ పై హెలిపాడ్ ఏర్పాటైతే, ఇండియాలో తన కార్యాలయంపై హెలిపాడ్ ఉన్న ఏకైక సీఎంగా చంద్రబాబునాయుడు కొత్త చరిత్ర సృష్టించనున్నారు. సీఎం ఇంటి నుంచి బయలుదేరితే, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం, ఆపై హెలికాప్టర్ దిగగానే వెంటనే కార్యాలయంలోకి వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఆర్డీయే కమిషనర్ ఎన్ శ్రీకాంత్ వెల్లడించారు. సచివాలయంలో భాగంగా ఆరు భవనాలు వస్తాయని, చంద్రబాబు కార్యాలయం ఉండే ఏ బ్లాక్ పై 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి అనువుగా హెలీపాడ్ నిర్మిస్తామని ఆయన వివరించారు.