: 'రింగింగ్ బెల్స్' వెనకున్న మోహిత్ కథ ఇది!


రింగింగ్ బెల్స్... నాలుగైదు రోజుల క్రితం వరకూ ఎవరికీ తెలియని సంస్థ. నోయిడా ప్రాంతంలో మూడు గదుల్లో ఉన్న ఐటీ కంపెనీ మాత్రమే. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఐటీ, టెలికం కంపెనీల చూపును తనవైపు తిప్పుకుంది. ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలో, ఎవరికీ నమ్మశక్యం కాని రీతిలో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ సంస్థ వెనకున్నది మోహిత్ గోయల్. యూపీలోని శామ్లి జిల్లా పరిధిలోని గర్హిపుక్తా అనే చిన్న పట్టణం నుంచి వచ్చాడు. అతని తండ్రి రాజేష్ గోయల్ కు ఓ చిన్న కిరణా దుకాణం అక్కడుంది. షాపులో కూర్చుని తండ్రికి సహాయం చేస్తుండే మోహిత్ , భవిష్యత్ లో ఏదో సాధిస్తాడని తమకు ఎన్నడో తెలుసునని ఇప్పుడు రాజేష్ గర్వంగా చెబుతున్నాడు. ఇప్పుడా ఊరిలో రాజేష్ ఓ ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు. "గర్హిపుక్తాలో సెయింట్ ఆర్సీ కాన్వెంట్ స్కూలులో విద్యను అభ్యసించిన తరువాత, మోహిత్ డిగ్రీ కోసం నోయిడా వెళ్లి అమిటీ యూనివర్శిటీలో చేరాడు. ఇంతకుముందు నా దగ్గరికి వచ్చినప్పుడు ఓ కంపెనీ పెట్టాలన్న తన కోరికను చెబితే, కొంత డబ్బిచ్చి పంపాను. వాటితో ఓ మొబైల్ కంపెనీ పెట్టాడని, అది ఇంత పెద్దదిగా మారిందని నాకు తెలీదు" అని ఫ్రీడమ్ 251 విడుదల రోజు ఢిల్లీకి వచ్చిన రాజేష్ తెలిపారు. ఇటీవలే నోయిడాకు చెందిన ధారణను తన కుమారుడు మోహిత్ వివాహం చేసుకున్నాడని వివరించాడు. రింగింగ్ బెల్స్ లో ఇప్పుడు ఆయన కూడా ఓ డైరెక్టర్ కాగా, ధారణ సీఈఓగా పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News