: కోట్లకు సారీ చెప్పిన డిగ్గీ రాజా!... ‘అనంత’ అవమానంపై విచారం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ క్షమాపణ చెప్పారు. పార్టీ ఏపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు నేటి ఉదయం విజయవాడకు వచ్చిన దిగ్విజయ్ సింగ్... కార్యక్రమానికి హాజరైన కోట్ల వద్దకు వెళ్లి సారీ చెప్పారు. ఇటీవల అనంతపురం జిల్లాలో జరిగిన రాహుల్ గాంధీ సభ వద్ద భద్రతా సిబ్బంది కోట్లను అడ్డుకున్నారు. దీంతో వేదిక ఎక్కకుండానే కోట్ల వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న కోట్ల అభిమానులు ఆయన సొంత జిల్లా కర్నూలులోని డీసీసీ కార్యాలయానికి తాళమేశారు. దీనిపై సమాచారం అందుకున్న డిగ్గీ రాజా... కోట్లను చల్లబరిచేందుకు ఓ మెట్టు కిందకు దిగారు. అనంతపురం సభలో జరిగిన అవమానానికి చింతిస్తున్నానని, ఘటనలో తమకు తెలియకుండా జరిగిన పొరపాటును పెద్ద మనసుతో క్షమించాలని కోరారు. సాక్షాత్తు డిగ్గీ రాజా సారీ చెప్పడంతో చల్లబడ్డ కోట్ల... పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.