: ఇప్పుడు బుల్లెట్ రైళ్లెందుకు?: మోదీ సర్కారుకు 'మెట్రో మ్యాన్' సూటి ప్రశ్న
ప్రస్తుతానికి ఇండియాకు బుల్లెట్ రైళ్ల అవసరం లేదని ఢిల్లీ మెట్రో చీఫ్, 'మెట్రో మ్యాన్'గా పేరు తెచ్చుకున్న డాక్టర్ ఈ శ్రీధరన్ అభిప్రాయపడ్డారు. బుల్లెట్ రైళ్ల వెంట పరిగెత్తే బదులు రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించడంపై దృష్టిని సారించాలని ఆయన మోదీ సర్కారుకు సలహా ఇచ్చారు. గడచిన మూడు పుష్కరాలుగా రైల్వే శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన, మరో 10 ఏళ్ల తరువాత మాత్రమే బుల్లెట్ రైళ్ల అవసరం ఇండియాకు ఏర్పడుతుందని అన్నారు. కాగా, ముంబై, అహ్మదాబాద్ మధ్య బులెట్ రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం రూ. 98 వేల కోట్ల అంచనా వ్యయంతో భారత్, జపాన్ ల మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. మొత్తం 505 కిలోమీటర్ల మధ్య దూరం ప్రయాణించేందుకు ప్రస్తుతం 8 గంటల సమయం పడుతుండగా, దాన్ని మూడు గంటలకు కుదించే లక్ష్యంతో ఈ ట్రాక్ నిర్మాణాన్ని తలపెట్టారు.