: బీజేపీ వారు హత్య, అత్యాచారం చేస్తే నేరాలు కాదు... వారిని విమర్శిస్తే మాత్రం అది పెద్ద నేరమా?: విరుచుకుపడ్డ కేజ్రీ
బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ ఓ విద్యార్థిని చితకబాదుతూ అడ్డంగా దొరికిపోయినా, ఆయన్నింకా అరెస్ట్ చేయకపోవడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. "కేంద్రం ఇప్పుడు కొత్త ఐపీసీని అమలు చేస్తోంది. హత్య చేసినా, అత్యాచారమైనా, ఎవరినైనా కొట్టినా... వారు బీజేపీ వారైతే అది నేరం కాదు. అదే బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ ను విమర్శిస్తే, అది అతిపెద్ద నేరం" అని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. "ఎవరినైనా బహిరంగంగా కొట్టి, ఆపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడని ఒక్క మాట చెబితే వదిలేస్తారు" అని ఓ సలహా కూడా ఇచ్చారు. కాగా, నిన్న ఓపీ శర్మను 8 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు ఆయనకు రాచమర్యాదలు చేశారని ఓ దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆయనకు రెస్టారెంట్ నుంచి తెప్పించిన శాకాహార భోజనం పెట్టి, ఆపై కాఫీ ఇచ్చి, బెయిలిచ్చి పంపారని తెలిపింది.