: ‘జేఎన్ యూ’ మాస్టర్ మైండ్ ఉమర్ ఖలీద్... సిమి మాజీ చీఫ్ ఇలియాస్ కుమారుడట!
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పార్లమెంటుపై దాడి నిందితుడు అఫ్జల్ గురు ఉరితీతకు నిరసనగా ర్యాలీ, దానిని ఏబీవీపీ అడ్డుకోవడం, ర్యాలీలో దేశ విద్రోహ నినాదాలు... తదితరాలపై పెద్ద దుమారమే రేగింది. చిలికి చిలికి గాలివానలా మారిన ఈ వివాదంలో జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ పై దేశ ద్రోహం కేసు నమోదైంది. అయితే ర్యాలీలో దేశానికి వ్యతిరేకంగా గొంతు చించుకున్నది కన్నయ్య కుమార్ కాదని, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉమర్ ఖలీద్ అనే వ్యక్తి ఉన్నాడని పోలీసులు దాదాపుగా నిర్ధారించుకున్నారు. జేఎన్ యూలో వివాదం రాజుకోగానే ఢిల్లీ నుంచి పరారైన ఉమర్ ఖలీద్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో తలదాచుకున్నట్లు సమాచారం. నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) మాజీ చీఫ్ ఎస్ క్యూఆర్ ఇలియాస్ కుమారుడే ఉమర్ ఖలీద్ అని ‘టైమ్స్ నౌ’ ఛానెల్ కు చెందిన ఓ ప్రతినిధి ట్విట్టర్ లో ప్రకటించారు. దీంతో షాక్ తిన్న పోలీసులు ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.