: ఒక రాజధానికి మూడు శంకుస్థాపనలు చేసిన ఘనత చంద్రబాబుదే: రఘువీరా సెటైర్
ఒక రాజధానికి మూడు శంకుస్థాపనలు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే చెల్లుతుందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సెటైర్ వేశారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకే రాజధానికి చంద్రబాబునాయుడు ఒకసారి, ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి, మళ్లీ చంద్రబాబు మూడోసారి శంకుస్థాపన చేశారని అన్నారు. రాష్ట్రం విడిపోయి రెండేళ్లు పూర్తవుతున్నా రాజధానిలో నిర్మాణాలు చేపట్టకుండా ఇప్పుడు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి 40 వేల కోట్లు కావాల్సి ఉంటే, చంద్రబాబు 1500 కోట్ల రూపాయలు అడిగితే కేంద్రం 200 కోట్ల రూపాయలు భిక్షమేసిందని ఆయన మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి పూర్తి నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదని ఆయన స్పష్టం చేశారు.