: ఎర్రబెల్లి పార్టీ మారిన రాత్రి నిద్రపట్టలేదు: రేవంత్ రెడ్డి
టీ టీడీఎల్పీ మాజీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్ లో చేరిన రాత్రి తనకు నిద్ర పట్టలేదని ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏం జరుగుతోంది? కేవలం టీడీపీ నుంచే నేతలు ఎందుకు పార్టీ మారుతున్నారు? అని చాలా ఆలోచించానని అన్నారు. అయితే తెల్లవారుజామున తన ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చాయని రేవంత్ తెలిపారు. పోయిన వారి గురించి ఇంత ఆలోచించాల్సిన అవసరం ఉందా? అనిపించిందని, ఇకపై వారి గురించి ఆలోచించడం మాని, పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం పాటుపడాలని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. నేతలు మారినా కార్యకర్తలు పార్టీని నమ్ముకుని ఉన్నారని ఆయన చెప్పారు. టీడీపీ కోసం యువ నేతలను తయారు చేస్తానని ఆయన చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనపై పెద్ద బాధ్యతలు పార్టీ అధినేత చంద్రబాబు పెట్టారని, దానికి న్యాయం చేస్తానని ఆయన తెలిపారు.