: అచ్చుతప్పువల్ల హనుమంతుడి పేరిట నోటీసులు జారీ అయ్యాయట...మేజిస్ట్రేట్ కోర్టు వివరణ
బీహార్లో న్యాయస్థానం హనుమంతుడికి నోటీసులు పంపిందన్న వార్త వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. హనుమంతుడు కోర్టుకి ఎలా వస్తాడని పలువురు ప్రశ్నించారు. భారత్ లో న్యాయస్థానాల పనితీరుకు ఈ సంఘటన మచ్చుతునక అంటూ పలువురు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. దీంతో తప్పు గ్రహించిన రోహ్తాన్ జిల్లా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది. తాము గుడి మేనేజర్ లేదా పూజారి పేరుతో నోటీసులు జారీ చేయమని చెప్పామని, అయితే కింది స్థాయిలో జరిగిన అచ్చుతప్పువల్ల హనుమంతుడి పేరిట నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. దేవుడు కోర్టుకి రావాలని కానీ, లేదా దేవుడి పేరిట సమన్లు జారీ చేయాలన్నది కానీ తమ ఉద్దేశం కాదని ఈ ప్రకటనలో స్పష్టం చేశారు.