: డెబిట్ కార్డు సమాచారాన్ని దొంగిలించి.... రూ.3 లక్షలకు ఆన్ లైన్ షాపింగ్
ఎంతో నమ్మకంగా పనిచేసిన ఆఫీస్ బాయ్ పని మానేశాక సంస్థ యాజమానికే టోపీ పెట్టిన ఘటన చోటుచేసుకుంది. డెబిట్ కార్డు లేకుండానే ఎంతో చాకచక్యంతో ఆ నంబర్ ఉపయోగించి లక్షలు దోచేయడం మిస్టరీ ఘటనను తలపిస్తోంది. శ్రీకాంత్ రెడ్డి (19) అనే యువకుడు హైదరాబాదులోని స్నైపర్ ఎలక్ట్రానిక్స్ లో కొంతకాలం ఆఫీస్ బాయ్ గా పనిచేశాడు. 2015 డిసెంబరులో ఉద్యోగం మానేశాడు. కంపెనీలో పని చేస్తున్న సమయంలోనే యజమాని డెబిట్ కార్డు నెంబరు, సీవీవీ నెంబరు, ఎక్స్ పైరీ డేట్ లను జాగ్రత్తగా రాసుకున్నాడు. ఆ తరువాత అసలు పని ప్రారంభించాడు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ యాప్ లను తన మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకున్నాడు. ఆ తరువాత తన వద్ద ఉన్న డెబిట్ కార్డు నంబర్ తో తనకు కావల్సిన వస్తువలన్నింటినీ కొనుగోలు చేశాడు. తన అసలు అడ్రస్ కాకుండా మరో అడ్రస్ ఇచ్చి డెలివర్ బాయ్ కాల్ చేసిన వెంటనే వెళ్లి వస్తువులను తీసుకునే వాడు. ఇలా రూ.3 లక్షల వరకు ఆన్ లైన్ లో షాపింగ్ చేశాడు. ఇలా తానేమీ కొనకుండానే తన ఖాతాలోంచి డబ్బు మాయమవుతుండటం స్నైపర్ ఎలక్ట్రానిక్స్ అధినేత ఖాజా సల్మాన్ వాసిఫ్ ను ఆందోళనకు గురిచేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు దాదాపు మూడు లక్షల వరకు ఆన్ లైన్ లావాదేవీలు జరిగాయని అకౌంట్ బ్యాలెన్స్ లో ఉందంటూ నగర సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తానేం కొనకపోయినా, డెబిట్ కార్డు తన వద్దే ఉన్నా డబ్బులు పోతున్నాయని తెలిపాడు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు ఈ-కామర్స్ వెబ్ సైట్ల నుంచి ఖాజా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తున్న ఫోన్ నంబర్, వస్తువుల డెలివరీ చేసిన చిరునామాను సేకరించారు. ఆ నంబర్ కు ఫోన్ చేయగా సిగ్నల్స్ శంకర్ పల్లిలో ట్రేస్ అయ్యాయి. ఆ ప్రాంతానికి వెళ్లి చిరునామా కనుక్కోగా నిందితుడు శ్రీకాంత్ రెడ్డే ఈ పనిచేస్తున్నట్టు గుర్తించి, అతనిని అరెస్టు చేశారు. ఆ వెంటనే ఆన్ లైన్ లో కొన్నవాటిలో దాదాపు రూ.1.50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటు ఈ-కామర్స్ వెబ్ సైట్లు కూడా అతడు ఆర్డర్ చేసిన ఇతర వస్తువులను డెలివరీ చేయకుండా ఆపేశాయి. ఆ డబ్బును తిరిగి యజమాని అకౌంటుకే క్రెడిట్ చేశాయి.