: పెళ్లి సంబరాలలో విషాదం... తుపాకి గుండుకి పెళ్లి కొడుకు బలి!
రౌడీ రాజకీయం రాజ్యమేలే ఉత్తరప్రదేశ్ లో ఉన్నత మధ్య తరగతికి చెందిన వారి వివాహాలను అట్టహాసంగా నిర్వహించడం సాధారణం. ఈ వివాహాల సందర్భంగా ఊరేగింపు, లేదా సంబరాల ప్రారంభానికి ముందు గాల్లోకి తుపాకులు పేల్చడాన్ని గర్వంగా భావిస్తారు. తాజాగా ఆ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలో ఓ వివాహం జరిగింది. ఈ వేడుక ముగింపును సూచిస్తూ, వరుడి బంధువుల్లో ఓ వ్యక్తి తుపాకీతో గాల్లోకి కాల్చడానికి ప్రయత్నించడంతో, బుల్లెట్ గురితప్పి సరాసరి వెళ్లి నేరుగా వరుడి తలకు తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే అతనిని లక్నోలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో రెండు కుటుంబాల్లోను విషాదం నిండుకుంది. కాగా, ఇటీవలి కాలంలో ఇలాంటి తుపాకీ కాల్పుల్లో అమాయకులు మరణిస్తుండడంతో, ఇలాంటి ఉత్సవాల్లో తుపాకులు కాల్చకూడదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిబంధనను తుంగలో తొక్కి మరీ కాల్పులు జరపడం విశేషం. నిందితుడ్ని గుర్తించేందుకు పోలీసులు ఆ కార్యక్రమం నాటి వీడియో పుటేజ్ ను పరిశీలిస్తున్నారు.