: యాపిల్ కోర్టు ధిక్కారాన్ని సమర్థించిన సుందర్ పిచాయ్
శాన్ బెర్నార్డినోలో 14 మందిని కాల్చి చంపిన ఉగ్రవాది ఫోన్ ను అన్ లాక్ చేసి, ఎఫ్బీఐ విచారణకు సహకరించాలన్న అమెరికా కోర్టు ఆదేశాలను యాపిల్ సంస్థ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో యాపిల్ నిర్ణయాన్ని గూగుల్ సంస్థ సమర్థించింది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ మెసేజ్ పెట్టారు. నేరాలు, ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించేందుకు భద్రతా సంస్థలు అహరహం శ్రమిస్తాయని తమకు తెలుసని అన్నారు. అయితే వినియోగదారుల సమాచారానికి భద్రత కల్పించే వస్తువులను తాము రూపొందిస్తామని, అలాంటి తమను హ్యాకింగ్ ఎనేబుల్ చేయాలని ఒత్తిడి చేయడం వినియోగదారుల ప్రైవసీ విషయంలో రాజీపడాలని చెప్పడమేనని తెలిపారు. సమాచారాన్ని భద్రంగా ఉంచే సురక్షితమైన వస్తువులు రూపొందించడమే కాకుండా, చట్టపరమైన ఆదేశాల మేరకు డాటా యాక్సెస్ కు అవకాశం కల్పిస్తామని అన్నారు. కస్టమర్ డివైస్ ని హ్యాక్ చేయడం వేరే విషయమని ఆయన తెలిపారు. ఇది మున్ముందు వేరే సమస్యలకు దారితీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.