: టీ టీడీపీతో బీజేపీ తెగదెంపులు?... పొత్తు వద్దంటూ తెలంగాణ శాఖ తీర్మానం
తెలంగాణలో టీడీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న గ్రేటర్ ఎన్నికల్లో 90 స్థానాలకు పైగా ఆ పార్టీ పోటీ చేస్తే ఒక్క సీటులోనే విజయం సాధించింది. చాలా చోట్ల ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. అప్పటిదాకా బలంగా ఉన్న టీడీపీ... బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగినా, బీజేపీ గెలిచినన్ని స్థానాలను కూడా గెలవలేకపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే టీ టీడీఎల్పీ నేత హోదాలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి రాంరాం పలికి కారెక్కేశారు. తాజాగా బీజేపీ కూడా ఆ పార్టీతో కలిసి ముందుకు సాగేందుకు ససేమిరా అంటోంది. అటు కేంద్రంలోనే కాక ఇటు ఏపీలోనూ మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీలు తెలంగాణలోనూ మిత్రపక్షాలుగానే ఉన్నాయి. అయితే టీడీపీతో కలిసి ముందుకు సాగితే, భవిష్యత్తులో మరింత మేర బలహీనపడతామని భావిస్తున్న బీజేపీ తెలంగాణ శాఖ... సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న టీడీపీ మైత్రికి చరమ గీతం పాడాలని నిర్ణయించుకుంది. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీగా ముద్రపడ్డ టీడీపీతో ముందుకు సాగితే, భవిష్యత్తులో బలోపేతం అటుంచి, ఉన్న కార్యకర్తల బలం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో టీటీడీపీతో ఇక పొత్తుకు స్వస్తి పలకాలని బీజేపీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సమాచారం. ఈ తీర్మానం కాపీని పార్టీ అధిష్ఠానానికి పంపే బాధ్యతను పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన భుజాలకెత్తుకున్నారు. మరి తెలంగాణ పార్టీ శాఖ పంపిన తీర్మానంపై బీజేపీ జాతీయ నాయకత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.