: విజయవాడ ఆంధ్రరత్న భవన్ కేంద్రంగా... రేపటి నుంచి ఏపీ పీసీసీ కార్యకలాపాలు
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత హైదరాబాదులోని ఇందిరాభవన్ నుంచి కార్యకలాపాలు కొనసాగించిన ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇకపై విజయవాడ నుంచే పూర్తిస్థాయి కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించింది. ఇప్పటికే వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ బెజవాడలో తమ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే రాష్ట్ర వ్యవహారాలను చూసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉన్న విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ ను పూర్తిస్థాయి రాష్ట్ర వ్యవహారాల కోసం వినియోగించుకునేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. విజయవాడ కేంద్రంగా 13 జిల్లాల నేతల రాకపోకలు సాగించేందుకు అనువుగా ఉంటుందని ఆ భవన్ లోని కిందిభాగాన్ని పూర్తి స్థాయిలో ఆధునికీకరించారు. గదులన్నింటిలో సీలింగ్, ఏసీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రేపు ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు.