: జాతరలో ఏఎస్పీ దురుసు వర్తన... మేడారంలో సీనియర్ జర్నలిస్టుపై చేయి చేసుకున్న ఐపీఎస్
లక్షలాది మంది భక్తులు పోటెత్తనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో నిన్న తొలిరోజే ఓ యువ ఐపీఎస్ అధికారి సహనం కోల్పోయారు. ట్రాఫిక్ నియంత్రణ పేరిట రంగంలోకి దిగిన సదరు ఐపీఎస్ ఆనారోగ్యం బారినపడ్డ భక్తురాలికి చికిత్స అందిస్తున్న వైద్యుడిపైనే కాక బాధితురాలి భర్త, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి చెంప చెళ్లుమనిపించారు. అంతటితో ఆగని ఆ యువ పోలీసు అధికారి యాదగిరితో పాటు వైద్యుడిని రెండు గంటల పాటు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. వివరాల్లోకెళితే.. తొలిరోజే జాతరకు వచ్చిన పాశం యాదగిరి కుటుంబ సభ్యులతో కలిసి గద్దెల వద్దకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన సతీమణి సరోజిని అనారోగ్యంతో కిందపడిపోయారు. వైద్యులకు సమాచారమందడంతో అంబులెన్స్ అక్కడికి వచ్చింది. పాలమూరు జిల్లా ఆర్థోపెడిక్ సర్జన్ రాంకిషన్ బాధితురాలికి చికిత్స చేసి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే యత్నం చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షల పేరిట అంబులెన్స్ ను అడ్డుకున్న ములుగు ఏఎస్పీ విశ్వజిత్... అక్కడ నెలకొన్న చిన్నపాటి వాగ్వాదంతో ఆగ్రహోదగ్రుడయ్యారు. అంబులెన్స్ డ్రైవర్ తో పాటు వైద్యుడు రాంకిషన్ ను కూడా విశ్వజిత్ చితకబాదారు. అడ్డుచెప్పబోయిన పాశం యాదగిరి చెంపను కూడా ఆయన చెళ్లుమనిపించారు. ఈ దాడిలో పాశం యాదగిరి చొక్కా చిరిగిపోవడమే కాక కళ్లద్దాలు పగిలిపోయాయి. అంతటితో ఆగని విశ్వజిత్... యాదగిరితో పాటు రాంకిషన్ ను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించి రెండు గంటల పాటు కూర్చోబెట్టారట. ఆ తర్వాత విషయం తెలుసుకున్న జర్నలిస్టులు, వైద్యులు ఆందోళనకు దిగడంతో జోక్యం చేసుకున్న కలెక్టర్ వాకాటి కరుణ... విశ్వజిత్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.