: పట్టుతప్పి పడిపోయిన కేకే... ఒడిసిపట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది
టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావుకు వయసు మీద పడుతోంది. జర్నలిస్టుగా వృత్తి జీవితం ప్రారంభించిన ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి ‘గ్రాండ్’గా ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ చీఫ్ గా నూ పనిచేశారు. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడటంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కేకే... రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ‘చేయి’చ్చి గులాబీ కండువా కప్పుకున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న కేకేకు టీఆర్ఎస్ అధినేత కీలక భాధ్యతలే అప్పగించారు. ఇక అసలు విషయంలోకి వస్తే, వయసు మీద పడుతున్న కేకే... పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాలుపంచుకోలేకపోతున్నారు. నిన్న జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడికి వచ్చిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైకి ఎక్కే క్రమంలో కాలు జారి పట్టు తప్పి పడిపోబోయారు. అయితే కేకే కింద పడేలోగానే ఆయన సెక్యూరిటీ సిబ్బంది వేగంగా స్పందించారు. చేరోవైపున నిలబడ్డ ఆయన సెక్యూరిటీ గార్డులు కేకేను కిందపడనీయకుండా ఒడిసిపట్టుకున్నారు.