: ఇంటిలో కేసీఆర్ కు గుడి!...వీరాభిమానం చాటుకున్న ఆదిలాబాదు జిల్లా టీఆర్ఎస్ కార్యకర్త
అభిమానముంటే... గుండెలో గుడి కడతారు. లేదంటే... తాముంటున్న ప్రాంతంలో గుడి కడతారు. అలాంటి గుడి... ఇంటిలో కట్టుకుంటే? ఆ అభిమానిని వీరాభిమాని అనాల్సిందే. ఇలాంటి వీరాభిమానులను కలిగివున్న ప్రస్తుత రాజకీయ నేతల్లో ‘గులాబీ’ దళపతి, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందు వరుసలో ఉంటారు. కేసీఆర్ వీరాభిమాని అయిన గుండ రవీందర్ అనే వ్యక్తి ఆయనకు తన సొంత ఇంటిలో గుడి కట్టారు. ఆదిలాబాదు జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన రవీందర్... టీఆర్ఎస్ దండేపల్లి మండల అధికార ప్రతినిధిగా ఉన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న రవీందర్... నిన్న కేసీఆర్ జన్మదినం సందర్భంగా తన ఇంటిలో తన అభిమాన నేతకు కట్టిన గుడిలో కేసీఆర్ విగ్రహాన్ని తన తండ్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి కేసీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఇక ఇక్కడ మరో ఆసక్తికర అంశమేంటంటే... టీఆర్ఎస్ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించేదాకా చోటుచేసుకున్న కీలక ఘటనలను తెలుపుతూ ఓ పాలరాతి శిలా ఫలకాన్ని కూడా గుడి పక్కనే ఏర్పాటు చేశారు.