: యువతుల ‘కొలత’ల నమోదులో మగ కానిస్టేబుళ్లు!... చర్యలు తప్పవన్న రాజస్థాన్ సర్కారు
దేశంలోని పోలీసు విభాగాల్లోనే కాక సైనిక దళాల్లోనూ మహిళల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ప్రజా ప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే ఆయా పోలీస్ స్టేషన్లలో మహిళా ఉద్యోగులకు అవసరమైన కనీస వసతుల కల్పనలో ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదంటూ ఇటీవల ఓ అధ్యయన సంస్థ సంచలన నివేదికను విడుదల చేసింది. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు, ముందు ఉద్యోగాలకు వస్తున్న యువతుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న వైఖరి చూస్తే, ఇకపై ఏ ఒక్క మహిళ కూడా భద్రతా దళాల్లో చేరదేమో. బీజేపీ మహిళా నేత వసుంధర రాజే సీఎంగా ఉన్న రాజస్థాన్ లోని జైపూర్ లో నిన్న చోటుచేసుకున్న ఓ ఘటన చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. అటవీ శాఖ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకుని రాత పరీక్షలో అర్హత సాధించిన యువతుల శారీరక కొలతలు తీసుకునే పనిని ‘మగ’ పోలీసులు స్వీకరించారు. అక్కడ మహిళా కానిస్టేబుళ్లు లేరా? అంటే... చాలా మందే ఉన్నారు. మహిళా కానిస్టేబుళ్లను పక్కనబెట్టుకుని మరీ మగ కానిస్టేబుళ్లు యువతుల ఛాతీ కొలతలను తీశారు. ఇక ఈ సన్నివేశాన్ని ఆడ కానిస్టేబుళ్లతో పాటు ఉన్నతాధికారులు కూడా స్వయంగా పర్యవేక్షించారు. ఈ దృశ్యాలు నిన్న దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెర తీశాయి. దీంతో కాస్తంత ఆలస్యంగా స్పందించిన రాజస్థాన్ అటవీ శాఖ మంత్రి రాజ్ కుమార్ రిన్వా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలను సమర్ధంగా నిర్వహించామనుకున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.