: చిన్న పిల్లలకూ ఎగతాళి అయిపోయాం: వెంకయ్య ఆవేదన
త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సజావుగా సాగనివ్వాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విపక్షాలను కోరారు. గతంలో పార్లమెంట్ జరిగిన తీరును చూసి చిన్న పిల్లలు సైతం ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారని, ఇకపై ఆ పరిస్థితి రానివ్వద్దని ఆయన కోరారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రాంతీయ పార్టీలు వివిధ అంశాలపై చర్చలను కోరుతున్నాయని, జాతీయ పార్టీలు మాత్రం అందుకు సహకరించే ఉద్దేశాన్ని చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో అంశాలపై సవివరమైన చర్చ జరగాల్సి వుందని, దేశాభివృద్ధికి కీలకమైన ఎన్నో చట్టాలను అమల్లోకి తేవాల్సి వుందని వెల్లడించిన వెంకయ్య, విపక్షాలు సహకరిస్తేనే ఇండియా ముందడుగు వేస్తుందన్నారు. అన్ని బిల్లులపై చర్చిద్దామని, అత్యధికులకు అనుకూలమైతేనే ఆమోదించాలని ఆయన కోరారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలను వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వారు లేవనెత్తే అన్ని అంశాలపైనా సమాధానం ఇస్తామని అన్నారు. ప్రజాస్వామ్య మూల స్ఫూర్తిని ఏ పార్టీ కూడా దెబ్బతీయరాదని అన్నారు. జాతి సమగ్రతకు సంబంధించిన తీవ్రమైన అంశాలకు విద్యార్థుల ముసుగు తగిలించి రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. ఢిల్లీ యూనివర్శిటీలో జరిగింది తప్పేనని, ఈ విషయంలో జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిని వదిలిపెట్టబోమని వెంకయ్య స్పష్టం చేశారు. వర్శిటీలో అమాయక విద్యార్థులను రక్షిస్తామని, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని చెబుతున్న విపక్షాలు దాన్ని నిరూపించాలని సవాల్ విసిరారు.