: రూ. 10,700 కోట్లతో కొత్తగా ఆరు రైల్వే ప్రాజెక్టులు... తెలుగు రాష్ట్రాలకు హ్యాండ్!
మరో 10 రోజుల్లో 2016-17 రైల్వే బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో ఆరు రైల్వే లైన్ల ప్రతిపాదనలకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ బుధవారం నాడు అనుమతులు మంజూరు చేసింది. పెరిగిన ప్రయాణికుల, రవాణా అవసరాలను తీర్చేందుకు వీటిని అంగీకరిస్తున్నట్టు రైల్వే మంత్రి సురేష్ ప్రభు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. ఈ ఆరు ప్రాజెక్టుల కోసం రూ. 10,700 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు. వీటిల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక్క ప్రాజెక్టు కూడా లేకపోవడం గమనార్హం. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా హుబ్లీ - చికాజూర్ మధ్య 190 కి.మీ పొడవైన (డబ్లింగ్) మార్గాన్ని రూ. 1,294.13 కోట్లతో, రమ్నా - సిలిగురి మధ్య 261 కి.మీ (డబ్లింగ్) మార్గాన్ని రూ. 2,675.64 కోట్లతో, కట్ని - సిలిగురి మధ్య 261 కి.మీ (డబ్లింగ్) మార్గాన్ని రూ. 2,084.90 కోట్లతో చేపట్టనున్నారు. వీటితో పాటు బీహారులోని రాంపూర్ దుమ్లా - తాల్ - రాజేంద్రపుల్ సెక్టారులో డబ్లింగ్, అదనపు బ్రిడ్జ్ లను రూ. 1,700.24 కోట్లతో, వార్దా - బల్షారా మధ్య 132 కి.మీ (మూడవ లైన్) మార్గాన్ని రూ. 1,443.32 కోట్లతో, మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ - కాట్నీ మధ్య 165 కి.మీ (మూడవ లైన్) మార్గాన్ని రూ. 1,595.76 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీసీఈఏ నిర్ణయించింది. కాగా, గుంటూరు, గుంతకల్ మార్గంలో ద్రోణాచలం వరకూ డబ్లింగ్, ఒంగోలు - నాయుడు పేట మధ్య మూడవ లైన్, నడికుడి - బీబీనగర్ మధ్య డబ్లింగ్, రేణిగుంట - ద్రోణాచలం మధ్య డబ్లింగ్ తదితర ప్రాజెక్టులను తెలుగు రాష్ట్రాలు కోరినప్పటికీ, వాటికి ఆమోదం లభించలేదు.