: ఆ గ్రామాలు ఏపీలోనే ఉంటాయి... కేసీఆర్ వేటి గురించి అన్నారో తెలియదు: ప.గో. జిల్లా కలెక్టర్
విభజనానంతరం తెలంగాణ నుంచి నవ్యాంధ్రలో కలసిన నాలుగైదు గ్రామాలను తిరిగి తెలంగాణలోనే కలిపేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారంటూ ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దాంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో విలీనమైన ఆ గ్రామాల్లో కలకలం రేగింది. ఈ విషయం జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ దృష్టికి వెళ్లగా ఆయన ఓ తెలుగు పత్రికతో వివరంగా మాట్లాడారు. తెలంగాణ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఏ ఒక్క గ్రామం కూడా తిరిగి ఆ రాష్ట్రంలోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఏ సందర్భంగా ఏయే గ్రామాల గురించి ప్రకటన చేశారో తమకు తెలియదన్నారు. వాస్తవానికి గ్రామాల విలీనం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చర్చ పెట్టాలని, ఆ మేరకు సదరు జిల్లా నుంచి ప్రతిపాదనలు కూడా వెళ్లాలని చెప్పారు. మరింతవరకు తాము అటువంటి ప్రతిపాదనలపై ఆలోచన చేయలేదన్నారు. అసలింకా తెలంగాణలోని బూర్గంపహాడ్ మండలం నుంచి మరో నాలుగు గ్రామాలు తమ జిల్లాకే రావాల్సి ఉందని, దానిపై తెలంగాణ సర్కారుతో చర్చలు జరుపుతున్నామని కలెక్టర్ భాస్కర్ వివరించారు.