: జాతికి వ్యతిరేకంగా జేఎన్ యూ విద్యార్థి నేత ఎలాంటి నినాదాలు చేయలేదు: శత్రుఘ్నసిన్హా
బీజేపీ ఎంపీగా ఉన్నప్పటికీ పార్టీలోని లోపాలను ఎత్తి చూపుతూ ధైర్యంగా మాట్లాడే ఆ పార్టీ నేత శత్రుఘ్నసిన్హా జేఎన్ యూ వివాదంపై స్పందించారు. ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందిస్తూ, "జేఎన్ యూలో జరిగిన ఆ కార్యక్రమంలో కన్నయ్య కుమార్ ప్రసంగం మొత్తం విన్నాను. మా బీహార్ కు చెందిన ఆ యువ నాయకుడు ఎక్కడ కూడా జాతి వ్యతిరేకంగా లేదా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలాంటి నినాదాలు చేసినట్టు నాకనిపించలేదు. ఈ విషయంలో మా పార్టీకి చెందిన కొందరు నాయకులు అతిగా స్పందించారు" అని సిన్హా పేర్కొన్నారు. జేఎన్ యూ అంతర్జాతీయంగా కీర్తి గడించిన విద్యాసంస్థ అని, ఎంతో మంది అత్యుత్తమ విద్యార్థులు, ఉపాధ్యాయులున్న ఈ వర్సిటీలో ఇకముందు సంకటస్థితి నెలకొనకుండా బీజేపీ నేతలు ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరారు. వాళ్లు మన సొంత పిల్లలని, వారి జీవితాలపై ప్రభావం చూపే కేసులు పెట్టడం ఎంతవరకు సబబు? అని షాట్ గన్ ప్రశ్నించారు. అతి త్వరలోనే అతను (కన్నయ్య కుమార్) విడుదలవ్వాలని ప్రార్థించాలని సిన్హా ట్విట్టర్ లో కోరారు.