: ఢిల్లీ మెట్రో రైల్లో చంద్రబాబు!... ఫొటోను స్వయంగా ట్వీట్ చేసిన ఏపీ సీఎం
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. నిన్న సిస్కో కంపెనీ ప్రతినిధులతో చర్చల కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, ఆ భేటీ ముగిసిన తర్వాత అక్కడి నుంచే ముంబై వెళ్లారు. ఈ క్రమంలో ఢిల్లీలో భేటీ ముగిసిన తర్వాత ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు చంద్రబాబు మెట్రో రైలు ఎక్కారు. పార్టీ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావులతో కలిసి మెట్రో రైలు ఎక్కిన చంద్రబాబు ఎయిర్ పోర్టు దాకా అందులోనే వెళ్లారు. ఈ సందర్భంగా మెట్రో రైల్లో తాను ప్రయాణిస్తున్న ఫొటోను ఆయనే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘ఢిల్లీ మెట్రో సామర్ధ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా’ అంటూ ఆ ఫొటోకు ఆయన కామెంట్ ను జత చేశారు.