: మామకు... ప్రేమతో!: ఖేడ్ గెలుపును కేసీఆర్ కు బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చిన హరీశ్!


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేటితో 62 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. నేడు ఆయన 62వ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కొందరు పలు పత్రికల్లో భారీ ప్రకటనలు ఇస్తే, మరికొంత మంది పెద్ద పెద్ద హోర్డింగులను ఏర్పాటు చేయించారు. అయితే అందరికంటే తన మేనల్లుడు తన్నీరు హరీశ్ రావు నుంచే అసలు సిసలైన బర్త్ డే గిఫ్ట్ ను కేసీఆర్ అందుకున్నారు. అది కూడా తన బర్త్ డే వేడుకకు ఓ రోజు ముందుగానే ఆయన దానిని అందుకున్నారు. దానిని చూసి మురిసిపోయారు. మరువలేని, మరపురాని అనుభూతినిచ్చిన బహుమతిని ఇచ్చాడంటూ తన మేనల్లుడిని కేసీఆర్ ఆకాశానికెత్తేశారు. ఆ బహుమతి మరేదో కాదు... మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బంపర్ మెజారిటీతో పార్టీ అభ్యర్థి గెలుపు. నాలుగు సార్లు గెలిచి తిరుగులేని నేతగా ఎదిగిన పటోళ్ల కిష్టారెడ్డి హఠాన్మరణంలో ఉప ఎన్నిక అనివార్యమైన ఖేడ్ లో నిన్నటిదాకా గులాబీ జెండే ఎగురలేదు. తెలంగాణ గాలి బలంగా వీచిన మొన్నటి సార్వత్రిక ఎన్నికలలోనూ అక్కడ కిష్టారెడ్డికే జనం పట్టం కట్టారు. ఈ క్రమంలో కిష్టారెడ్డి కుటుంబంపై ఉన్న సానుభూతి ఓటును కూడా రాబట్టి ఉప ఎన్నికలో సత్తా చాటాలని భావించిన కేసీఆర్, ఆ బాధ్యతలను ‘ఉప ఎన్నికల విజయ సారథి’గా పేరుగాంచిన తన మేనల్లుడు హరీశ్ రావుకు అప్పగించారు. ఓ నాలుగైదు నెలలు ముందుగానే ఖేడ్ లో అడుగుపెట్టిన హరీశ్ రావు, నియోజకవర్గం మొత్తాన్ని ఓ రౌండేసి అక్కడ ఏమేం చేయాలో ఖరారు చేశారు. నెలల వ్యవధిలో పూర్తయ్యే పనులను ఎంచుకున్నారు. యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. మార్కెట్ యార్డు లేని నియోజకవర్గంగా ఖేడ్ కు ఉన్న పేరును తుడిచేశారు. కోటి రూపాయలు ఖర్చు పెట్టినా, నీటి చుక్క రాని తాగునీటి ప్రాజెక్టుకు మరో రూ.50 లక్షలు ఖర్చు పెట్టి మారుమూల కంగ్టి మండలంలోని పల్లెలకు తాగు నీరిచ్చారు. వెరసి గులాబీ పార్టీని ఖేడ్ లో రెపరెపలాడించారు. వెరసి బర్త్ డేకు ఓ రోజు ముందుగానే ఆయన తన మామకు ‘‘మామకు... ప్రేమతో’’ అంటూ మరపురాని బహుమానాన్ని ఇచ్చారంటూ తెలుగు పత్రికలు పలు కోణాల్లో ఆసక్తికర కథనాలు రాశాయి.

  • Loading...

More Telugu News