: రెడ్ కార్డు చూపించాడని రిఫరీని కాల్చి చంపిన ఆటగాడు
అర్జెంటీనా ఫుట్ బాల్ మ్యాచ్ లలో ఆటగాళ్లు దారుణంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువైపోతున్నాయి. గత ఏడాది జూన్ లో ఎల్లో కార్డు చూపించిన రిఫరీపై ఇద్దరు ప్లేయర్లు విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు గుద్దడంతో సదరు రిఫరీ స్పృహ కోల్పోయాడు. తాజాగా, కార్డోబా జిల్లాలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ లో తనకు రెడ్ కార్డు చూపించాడన్న కోపంతో రిఫరీ సీజర్ ఫ్లోర్స్(48) ను తన తుపాకీతో కాల్చి పారేశాడు ఓ ఆటగాడు. తన బ్యాగ్ లో ఉన్న తుపాకీని తీసుకువచ్చి రిఫరీపై మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటనలో ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న మరో ప్లేయర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, అతని ప్రాణాలకేమీ ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మ్యాచ్ జరుగుతుండగానే కాల్పుల ఘటన చోటుచేసుకుందని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు.