: హిమాలయాలకు వెళ్లిపోయిన గుంటూరు విద్యార్థిని ప్రత్యూష ఆచూకీ లభ్యం
గత నెల 17వ తేదీన తాను హిమాలయాలకు వెళ్లిపోతున్నానంటూ లేఖలు రాసిపెట్టి చెన్నైలోని ఐఐటీ-ఎం క్యాంపస్ ను వదిలిపెట్టిన గుంటూరు విద్యార్థిని వేదాంతం ఎల్ ప్రత్యూష ఆచూకీ లభించింది. చెన్నై, ఉత్తరాఖండ్ పోలీసులు, విద్యార్థిని తల్లిదండ్రులు బాలిక ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించడంతో ఫలితం దక్కింది. ఫోన్ కాల్ డేటా ప్రకారం ఆమె వెళ్లిపోయే రోజున చివరి సారిగా భాస్కర్ అనే వ్యక్తితో ఐదుసార్లు మాట్లాడింది. భాస్కర్ అనే వ్యక్తి, 'దొంగ బాబా' శివ గుప్తాకు సంబంధించినవాడు. భాస్కర్ తమ గురువును చూపిస్తానని.. ఆయన మోక్ష మార్గం చూపుతారని ప్రత్యూషకు మాయమాటలు చెప్పి ఆమెను ఆశ్రమానికి తీసుకువెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎట్టకేలకు బాధిత విద్యార్థినిని ఆశ్రమం నుంచి గుంటూరులోని బ్రాడీపేటలో ఉన్న ఆమె స్వగృహానికి చేర్చారు. ఈ సందర్భంగా విద్యార్థిని తండ్రి మాట్లాడుతూ, ప్రత్యూష క్షేమంగా ఉందని, ఆమె కనిపించకుండా పోవడంతో చెన్నై పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసును ఉపసంహరించుకున్నామని చెప్పారు. ఉత్తరాఖండ్ లోని దొంగ బాబా ఆశ్రమంలో తమ కూతురితో పాటు ఎంతో మంది అమ్మాయిలు, మహిళలు ఉన్నారని ఆయన చెప్పారు.