: ఇండియాలో ప్రభుత్వానికి, ఐటీ శాఖకూ సంబంధం ఇదేనా?: వోడాఫోన్ సూటి ప్రశ్న
ఇండియాలో ఆదాయపు పన్ను శాఖకు, ప్రభుత్వానికి ఎంతమాత్రమూ సంబంధం లేనట్టు కనిపిస్తోందని టెలికం సేవల సంస్థ వోడాఫోన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం మేకిన్ ఇండియా అంటూ ఎంత ప్రచారం చేస్తున్నా, పెట్టుబడులతో స్నేహపూర్వకంగా ఉంటామని చెబుతున్నా అవన్నీ రాతలకే పరిమితమయ్యాయని ఆరోపించింది. వోడాఫోన్ కు, ఆదాయపు పన్ను శాఖకు మధ్య వివాదం నెలకొని ఉండగా, తమకు కట్టాల్సిన 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 13,600 కోట్లు) పునరావృత పన్ను (రెట్రాస్పెక్టివ్ టాక్స్) తక్షణం చెల్లించాలని నోటీసులు పంపడంపై వోడాఫోన్ స్పందించింది. "మాకు టాక్స్ విభాగం నుంచి నోటీసులు అందాయి. ఈ డబ్బు చెల్లించకుంటే ఆస్తులను సీజ్ చేస్తామని కూడా వారు చెప్పారు. ఈ వివాదం అంతర్జాతీయ కోర్టు పరిధిలో ఉంది. భారత ప్రభుత్వం మా కేసు సహా పలు పన్ను వివాదాలను ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాల పరిధిలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ సైతం విదేశీ ఇన్వెస్టర్లతో స్నేహపూర్వకంగా ఉంటామని చెబుతున్నారు. కానీ, ఇప్పుడీ నోటీసులు చూస్తుంటే ప్రభుత్వానికి, ఐటీ శాఖకు సంబంధాలు తెగిపోయినట్లున్నాయి" అని వోడాఫోన్ ఓ ప్రకటనలో ఆరోపించింది. కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి జైట్లీలు వివిధ సందర్భాల్లో పునరావృత పన్ను ఇండియాలో గతించిపోయినట్టేనని వెల్లడించిన సంగతి తెలిసిందే.