: ముస్లిం బాలిక ప్రజ్ఞ... దృష్టి లోపాన్ని అధిగమించి భగవద్గీత కంఠస్థం!
అంధ విద్యార్థిని అయిన ఒక ముస్లిం బాలిక జ్ఞాపకశక్తి మాత్రం అమోఘం. ఒక్కసారి ఏదైనా వింటే ఇక మర్చిపోదు. అందుకు .. ఆమె నోటి వెంట అలవోకగా పలికే భగవద్గీత, ఖురాన్ శ్లోకాలే నిదర్శనం. మీరట్ కు చెందిన ఈ ఏడేళ్ల బాలిక రిదా జెహ్రా అక్కడి బ్రిజ్ మోహల్ అంథుల పాఠశాలలో మూడవ తరగతి చదువుతోంది. అక్కడి హాస్టల్ లోనే ఉంటోంది. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ, ‘2015లో భగవద్గీత శ్లోకాలకు సంబంధించిన ఒక కాంపిటీషన్ జరిగింది. ఈ కాంపిటీషన్ కు మా విద్యార్థులను తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ సందర్భంలోనే జెహ్రా ప్రజ్ఞ బయటపడింది. చెప్పిన విషయాన్ని చాలా తొందరగా జెహ్రా గ్రహించేది. కేవలం భగవద్గీత శ్లోకాలు మాత్రమే కాదు, ఖురాన్ కూడా కంఠస్థం చేసింది’ అని చెప్పారు. జెహ్రా తండ్రి రాయూస్ హైదర్ మాట్లాడుతూ, ఢిల్లీలో తాను బిర్యానీ అమ్ముతుంటానని, అదే తన జీవనాధారమని చెప్పారు. తన కూతురిని చదివించాలన్నదే తన కోరిక అని.. భగవద్గీత, ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాలను చదవడమన్న విషయాన్ని పక్కనపెడితే, ఆ మతాల గురించి తన కూతురు తెలుసుకోవడం గొప్ప విషయమని, తద్వారా ఇతర విద్యార్థుల కన్నా మరింత జ్ఞానసముపార్జనకు అవకాశముంటుందని ఆయన అన్నారు.