: వెంకన్న భక్తుడి రూపంలో టాస్క్ ఫోర్స్ డీఐజీ... స్వయంగా అడవుల్లో రెక్కీ!
శేషాచలం అడవుల్లో విలువైన ఎర్రచందనం వృక్షాలను స్మగ్లింగ్ చేస్తున్న దొంగల ఆట కట్టించేందుకు టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు స్వయంగా రంగంలోకి దిగారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు, తాను శ్రీవారి భక్తుడి వేషం వేసుకుని అడవుల్లోకి వెళ్లిపోయారు. ఆయనను పలువురు పోలీసులు అనుసరించగా, అడవుల్లో రెక్కీకై కదిలారు. భక్తుడి మాదిరిగా, తెల్ల పంచె, తెల్ల చొక్కా ధరించి, అడవుల్లో కిలోమీటర్ల కొద్దీ నడిచారు. పాపనాశనం, తుంబురు తీర్థం, శ్రీవారి మెట్టు, చీకటీగలకోన వంటి అన్ని ప్రాంతాలూ తిరిగారు. చీకటీగల కోన వద్ద వందమందికి పైగా స్మగ్లర్లు తనకు ఎదురు రావడం గమనించి పోలీసులను అలర్ట్ చేశారు. దీన్ని గమనించిన దొంగలు తాము తెస్తున్న దుంగలను వదిలి పరారుకాగా, ఇద్దరు స్మగ్లర్లు మాత్రం చిక్కారు. వీరిద్దరూ గతంలో జూపార్కు వద్ద దుప్పిని చంపిన కేసు నిందితులని టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. కాంతారావు రెక్కీ, ఇతర అధికారులకు ఆదర్శంగా నిలుస్తుందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.