: జేఎన్ యూ కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించలేం: ఢిల్లీ హైకోర్టు
ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేసిన జేఎన్ యూ విద్యార్థులపై నమోదైన దేశద్రోహం కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు విచారించింది. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారని, ముందు ఆ దర్యాప్తు పూర్తి కానివ్వాలని జస్టిస్ మన్మోహన్ తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఘటన జరిగింది ఈ నెల 9నే కాబట్టి దర్యాప్తునకు సమయం ఇవ్వాలని, ఈ లోపలే ఇలాంటి పిటిషన్లు వేయడం తొందరపాటు చర్య అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. కాబట్టి ఇలాంటి సమయంలో విచారణను ఎన్ఐఏకు అప్పగించలేమని స్పష్టం చేసింది. అనంతరం కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే జేఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.