: ఆరేళ్లలో 10 కోట్ల మందికి ఉద్యోగాలు... 'నిరుద్యోగ పజిల్' కు సమాధానం ఇదే!


'మేకిన్ ఇండియా' అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం, తీసుకుంటున్న చర్యలతో ఇండియాలో ఉద్యోగ సృష్టి శరవేగంగా జరగనుందని జాబ్ ప్లేస్ మెంట్ కంపెనీలు భావిస్తున్నాయి. కొత్త కంపెనీల రాక పెరిగి 2022 నాటికి 10 కోట్ల కొత్త ఉద్యోగాలు భారతీయులకు చేరువవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే సంవత్సరం వ్యవధిలో 7.2 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, మాన్యుఫాక్చరింగ్, ఇంజనీరింగ్ తదితర రంగాల్లో ఇప్పుడున్న ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే 8 నుంచి 13 శాతం అధికంగా ఉద్యోగులు ఉంటారని ప్లేస్ మెంట్ కంపెనీల ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఈ-కామర్స్, ఇంటర్నెట్ ఆధారిత రంగాల్లోనూ అధిక సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయని టీమ్ లీజ్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకులు రీతూపర్ణా చక్రవర్తి వ్యాఖ్యానించారు. 100 స్మార్ట్ సిటీల ఏర్పాటు ఆలోచన ఉద్యోగ సృష్టిని మరింతగా ఉద్దీపన చేయనుందని వివరించారు. తదుపరి ఐదారేళ్లూ ప్రతియేటా కోటికి పైగా కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఉదాహరణకు భారత తోళ్ల అభివృద్ధి పరిశ్రమ గడచిన 100 రోజుల్లో 50 వేల మందికి పైగా శిక్షణ ఇచ్చింది. తదుపరి సంవత్సరానికి 1.44 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఈ రంగంలో డిమాండ్ కు తగ్గట్టు ఉద్యోగులను సిద్ధం చేయాలని భావిస్తోంది. హైదరాబాద్ సహా పాట్నా, బానూర్, అంక్లేశ్వర్ ప్రాంతాల్లో ఈ శిక్షణా కేంద్రాలున్నాయి. "మేకిన్ ఇండియా ప్రతికూల ప్రభావం చూపుతోందన్న సంకేతాలు పెరుగుతున్నాయి" అని సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇండియా పాటిస్తున్న ఆర్థిక విధానాలతో మరింతమంది యువత వ్యవసాయం నుంచి పరిశ్రమల వైపు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ సందీప్ సర్కార్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇండియాలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువత 15.3 కోట్లుగా ఉండగా, 2020 నాటికి ఈ సంఖ్య మరింతగా పెరగనుంది. ఇక ఇండియాను మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మార్చాలన్న మోదీ కల నిజమైతే కోట్లాది మందికి ఉద్యోగాలు దగ్గరౌతాయని హిందుస్థాన్ పవర్ ప్రాజెక్ట్స్, హెచ్ఆర్ విభాగం హెడ్ అమన్ ఆత్రే వివరించారు. డిజైనింగ్ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ ప్లానింగ్ విభాగాలతో పాటు నిర్ణయాల అమలు, ప్రాజెక్టు పూర్తయిన తరువాత నిర్వహణ, డిస్ట్రిబ్యూషన్ వంటి అన్ని రంగాల్లో కొత్త ఉద్యోగాలు రానున్నాయని, దీంతో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని షినైడర్ ఎలక్ట్రిక్, చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ రచనా ముఖర్జీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News