: రష్యా అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థినులు మృతి

రష్యాలోని స్మోలన్స్క్ మెడికల్ అకాడమీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయారు. వారిద్దరు మహారాష్ట్రలోని నవీ ముంబయికి చెందిన పూజా కల్లూర్(22), పుణేకు చెందిన కరిష్మా భోసలే(20) అని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్ లో వెల్లడించారు. మాస్కోకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అకాడమీకి భారత ప్రతినిధి బృందం చేరుకుందని చెప్పారు. విద్యార్థినుల మరణంపట్ల మంత్రి సంతాపం తెలిపారు. కాగా, వీరిద్దరూ మెడిసిన్ నాలుగవ సంవత్సరం చదువుతున్నారు. మెడికల్ అకాడమీ భవనంలో నాలుగవ అంతస్తులోని హాస్టల్ లో అగ్నిప్రమాదం సంభవించిందని రష్యన్ విచారణ కమిటీ నిర్ధారించింది. ఈ సమయంలో ఇద్దరు విద్యార్థినులు నిద్రపోతున్నారని చెప్పారు. ఇదే ఘటనలో మరికొంతమంది గాయపడ్డారు. మరోవైపు వారిద్దరి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ వారంలోనే మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు.